భారీ వర్షాలపై ఎంపీ అర్వింద్ ఆరా ...అధికారులు అప్రమత్తంగా ఉండాలి
భారీ వర్షాలపై ఎంపీ అర్వింద్ ఆరా
...అధికారులు అప్రమత్తంగా ఉండాలి
...బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించండి
...కలెక్టర్ సీపీలకు ఫోన్ లో మాట్లాడిన ఎంపి
అక్షర విజేత, నిజామాబాద్ ప్రతినిధి : నిజామాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి ఆరా తీశారు. అకస్మాత్తుగా వచ్చిన భారీ వర్షాలపై జిల్లా కలెక్టర్,సీపీ లతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. సిరికొండ, ధర్పల్లి, ఇందల్ వాయి మండలాల్లో వర్ష ప్రభావం తీవ్రంగా ఉన్నదని, చాలా గ్రామాలు నీట మునిగిపోయిన విషయాలను ఆయన కలెక్టర్, సీపీ దృష్టికి తీసుకెళ్లారు. వినాయక చవితి పండుగ సెలవు దినమైనప్పటికీ, అధికారులు బాధ్యతతో పనిచేశారని, రానున్న రెండు రోజులు జిల్లాకు రెడ్ అలెర్ట్ ఉన్నందున ఇదే స్ఫూర్తితో బాధ్యతలు నిర్వహించి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వరద బాధితులను సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించి, కనీస సౌకర్యాలు అందించాలన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే అధికారులు ఆస్తి,పంట నష్టం పై నివేదిక అందజేసి, నష్టపరిహారంపై ప్రభుత్వానికి నివేదికలు అందజేయాలని కోరారు. నష్టపరిహారంపై తాను కూడా ముఖ్యమంత్రి కి లేఖ రాస్తానని, విపత్తు నిర్వహణపై హోం శాఖకి సైతం నివేదిస్తానన్నారు. మరోవైపు ప్రజలకు కూడా ఎంపీ అర్వింద్ కీలక సూచనలు చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ప్రయాణాలు చేయకుండా అధికారులకు సహకరించాలన్నారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు 39 గేట్లు ఎత్తినందున పరివాహక ప్రాంత ప్రజలు, పశువుల కాపరులు గోదావరి పరిసర ప్రాంతాలకి వెళ్లకుండా ఉండాలని కోరారు. వినాయక చవితి దృష్ట్యా, మండపాల వద్ద నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.